న్యూఢిల్లీ, జూన్ 2: గత కొన్ని నెలలుగా టాప్‌గేర్‌లో దూసుకుపోయిన వాహన సంస్థలకు గత నెలలో గట్టి షాక్ తగిలింది. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటర్ ఇండియకు చెందిన ప్యాసింజర్ వాహన అమ్మకాలు భారీగా పడిపోయాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం వల్లనే కార్లను కొనుగోలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ కార్ల సేల్స్ భారీగా పడిపోయాయి. గత నెలలో దేశీయంగా 1,35,962 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది మారుతి సుజుకీ. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 1,44,002 యూనిట్లతో పోలిస్తే ఆరు శాతం తగ్గాయని పేర్కొంది. ఎంట్రీ-లెవల్ విభాగానికి చెందిన కార్లకు డిమాండ్ పడిపోవడం వల్లనే మొత్తం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపిందని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు. దాయాదుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులతో జమ్ము అండ్ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాల్లో అమ్మకాలు 55 శాతం పడిపోయాయన్నారు. అలాగే హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 11 శాతం తగ్గి 43,861 యూనిట్లకు పరిమితమయ్యాయి.