PAN 2.0 Project : ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డులు చాలా కీలకం. రూ. 50 వేలు అంతకు మించిన ట్రాన్సాక్షన్స్ చేయాలంటే కచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందే. ఇప్పటికే పాన్, ఆధార్ కార్డును లింక్ చేస్తూ కేంద్రం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులన్నింటినీ రద్దుచేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
అందుకు సంబంధించి సోమవారం కేంద్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ 2.0 పేరుతో తీసుకున్న నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాంతె పాత పాన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో ఉన్న కొత్త కార్డులు అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులు ఈ కొత్త కార్డులను ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
అయితే ఈ మార్పు కోసం ప్రజలపై ఎలాంటి భారం పడకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకు రూ.1435 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. పాన్ 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా ట్యాక్స్ చెల్లించే వారికి మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించనున్నారు. ఈ కార్డులో పాన్ సేవలతోపాటు పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవలను కూడా ఏకీకృతం చేయనున్నారు.
ఈ విషయమై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశంలో 78 కోట్ల పాన్ కార్డులను పంపిణీ చేశామని, ఈ కొత్త ప్రాజెక్ట్ పన్ను చెల్లింపుదారులు ఉపయోగించే ప్రస్తుత వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయనుందని తెలిపారు.