Flights- Bomb Threats | శనివారం దేశవ్యాప్తంగా పలు నగరాల పరిధిలో 30కి పైగా విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విస్తారా, ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాసా ఎయిర్, స్పైస్ జెట్, స్టార్ ఎయిర్, అలయన్స్ ఎయిర్ సంస్థల విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వారంలో కనీసం 70 బాంబు బెదిరింపులు రాగా, వాటిలో అత్యధికం బూటకం అని తేలింది. శనివారం ఉదయం నుంచి 30కి పైగా అంతర్జాతీయ, జాతీయ విమాన సర్వీసులకు సోషల్ మీడియా ద్వారా బాంబు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయ రూట్లలో తిరిగే ఐదు విస్తారా, నాలుగు ఇండిగో సర్వీసులకు బెదిరింపులు వచ్చాయి. దేశీయ సర్వీసుల్లో ఉదయ్ పూర్ నుంచి ముంబైకి వచ్చిన విస్తారా యూకే624 విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తనిఖీలు చేయగా, బాత్ రూమ్ లో బాంబు ఉన్నట్లు భద్రతా అధికారుల నోట్లో పేర్కొన్నట్లు సమాచారం. శుక్రవారం సైతం మూడు విస్తారా అంతర్జాతీయ విమాన సర్వీసులకు వచ్చిన బాంబు బెదిరింపుల్లో వాటిలో ఒకటి బూటకం అని తేలింది. ముందు జాగ్రత్త చర్యగా ఒక విమాన సర్వీసును ఫ్రాంక్ పర్ట్కు డైవర్ట్ చేసి తనిఖీలు చేయించామని పౌర విమాన యాన శాఖ వర్గాలు తెలిపాయి. బూటకపు బెదిరింపు కాల్స్ నివారించడానికి కఠిన నిబంధనలు అమల్లోకి తేవాలని ఆ వర్గాల కథనం.