Union Minister Piyush Goyal | భారతీయ మహిళలకు ఎంతో పవిత్రమైంది మంగళసూత్రం. మహిళల ఐదో తనానికి గుర్తుగా నిలిచే మంగళసూత్రం విషయమై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారంపై దిగుమతి సుంకం తగ్గించిన మన అక్కాచెల్లెండ్లకు మంగళసూత్రం కొనుగోలు కష్టాలు లేవని వ్యాఖ్యానించారు. శుక్రవారం ముంబైలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దిగుమతి సుంకాలు తగ్గించిన తర్వాత బులియన్ మార్కెట్లో బంగారం విక్రయాలు పుంజుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం మన అక్కా చెల్లెళ్లు భారీ మంగళసూత్రాలు కలిగి ఉన్నారని వ్యాఖ్యానించారు.
గత జూలైలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశ పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బంగారం, వెండిలపై దిగుమతి సుంకం 15 నుంచి ఆరు శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. బంగారం పరిశ్రమలో ఏ చర్చ జరిగినా దిగుమతి సుంకాలు ప్రస్తావనకు వచ్చేవని పీయూష్ గోయల్ చెప్పారు. బులియన్ మార్కెట్ వర్గాలు నిత్యం బంగారంపై దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్రాన్ని కోరేవని గుర్తు చేశారు.