Larry Ellison | ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (Larry Ellison) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మొత్తం సంపదలో 95 శాతాన్ని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. లారీ ఎల్లిసన్ సంపద ప్రస్తుతం 393 బిలియన్ డాలర్లు (రూ. 34.6 లక్షల కోట్లు). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వచ్చిన అనూహ్యమైన వృద్ధి కారణంగా 2025లో ఒరాకిల్ షేర్ల విలువ భారీగా పెరిగింది. కంపెనీలో ఇప్పటికీ 41 శాతం వాటా ఉన్న ఎల్లిసన్ సంపద ఒక్క రోజులోనే అమాంతం పెరిగింది. దీనికి తోడు టెస్లాలో కూడా ఆయనకు గణనీయమైన వాటాలు ఉన్నాయి. ఇక తన సంపదను దాతృత్వానికి వినియోగిస్తానని 2010లోనే ఎల్లిసన్ ‘గివింగ్ ప్లెడ్జ్’ (Giving Pledge) తీసుకున్నారు. ఇందులో భాగంగా తన సంపదలో 95 శాతం విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు.
అయితే, ఆయన ఇతర బిలియనీర్లలా సంప్రదాయ స్వచ్ఛంద సంస్థల వైపు మొగ్గు చూపడం లేదు. దానికి బదులుగా తన సొంత సంస్థల ద్వారానే ఈ బృహత్కార్యాన్ని చేపట్టాలని ఎల్లిసన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎల్లిసన్ తన దాతృత్వ కార్యక్రమాల్ని ప్రధానంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం (Oxford University)లో ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని సంస్థ ఎల్లిసన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Ellison Institute of Technology) ద్వారా కొనసాగిస్తున్నారు. ఇది ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, వాతావరణ మార్పులు, AI పరిశోధన.. ఈ నాలుగు కీలకమైన ప్రపంచ సవాళ్లపై దృష్టి సారిస్తోంది.
Also Read..
Agni Prime Missile | అగ్నిప్రైమ్ పరీక్ష విజయవంతం
CP Radhakrishnan | తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
Liquor Scam | మద్యం కుంభకోణం.. మాజీ సీఎం కుమారుడు అరెస్ట్