ముంబై, జనవరి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీలను నష్టాలవైపు నడిపించాయి. అమెరికా తాజా టారిఫ్‌లను విధించనున్నట్టు ప్రకటించడంతో విదేశీ మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 244.98 పాయింట్లు కోల్పోయి 83,382.71 వద్ద స్థిరపడింది.
మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 66.70 పాయింట్లు కోల్పోయి 25,665.60 వద్ద స్థిరపడింది. మెటల్, కమోడిటీస్, ఎనర్జీ రంగ షేర్లు తీవ్ర ఆటుపోటులకు గురయ్యాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు పోటెత్తడంతోపాటు ఎఫ్ఐఐలు తరలిపోతుండటం, అమెరికా వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడంతో పతనానికి ఆజ్యంపోసినట్టు అయిందన్నారు.