Fuel Prices : ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివస్తాయనే అంచనాలు ఊపందుకున్నాయి. పెట్రేగుతున్న పెట్రో ధరల నుంచి ఉపశమనం కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వాహనదారులు, సామాన్యులకు ఈ వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. అయితే దీర్ఘకాలం ముడిచమురు ధరలు దిగువస్ధాయిలో నిలకడగా కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు ఆయిల్ కంపెనీలు మొగ్గుచూపుతాయని పెట్రోలియం కార్యదర్శి పంకజ్ జైన్ గురువారం పేర్కొన్నారు.
చమురు ధరలు ఇటీవల మూడేండ్ల కనిష్ట స్ధాయికి పడిపోవడంతో చమురు మార్కెటింగ్ కంపెనీల లాభదాయకత మెరుగుపడింది. దీంతో మహారాష్ట్ర, హరియాణ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు వెసులుబాటు కలిగింది. ఇక ఆర్ధిక మందగమన ఇంధన డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందనే అంచనాతో బ్రెంట్ క్రూడ్ మంగళవారం ఏకంగా మూడేండ్ల కనిష్ట స్ధాయిలో 70 డాలర్ల దిగువకు పడిపోయింది.
మరోవైపు ముడిచమురు ధరలు దిగివస్తున్నా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికీ పలు నగరాల్లో లీటర్‌కు రూ . 100 దాటి పరుగులు పెడుతున్నాయి. ఇంధన ధరలు భగ్గుమంటుండటంతో ద్రవ్యోల్బణం పైపైకి వెళుతోంది. రవాణా వ్యయాలు పెరిగి కూరగాయలు సహా నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. ధరలు తగ్గి ద్రవ్యోల్బణం దారికొచ్చి వృద్ధి రేటు ఊపందుకోవాలంటే ముందుగా భారమైన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని పరిశ్రమ వర్గాలతో పాటు ప్రజలు కోరుతున్నారు.
Read More :
Vinesh Phogat | నాలుగు లగ్జరీ కార్లు.. రూ.కోట్ల ప్రాపర్టీ.. వినేశ్ ఫోగట్ ఆస్తుల వివరాలు ఇవే..