Office Space | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో ముందంజలో ఉండే హైదరాబాద్ మహానగర స్థానం ఇప్పుడు అంతకంతకు దిగజారిపోతోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ జేఎల్ఎల్ వెల్లడించిన ప్రస్తుతేడాది మూడో త్రైమాసికపు(జూలై-సెప్టెంబర్ మధ్యకాలం) ప్రకారం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో దేశ వ్యాప్తంగా 14 శాతం మేర వృద్ధిని నమోదు చేసుకుంటే ఇటు హైదరాబాద్‌లో మాత్రం భారీగా తగ్గింది. మెట్రో నగరాల వారిగా చూస్తే హైదరాబాద్‌లో గతేడాది ఇదే త్రైమాసికంలో 2.70 మిలియన్ల చదరపు అడుగులు లీజుకు తీసుకుంటే, తాజాగా ఈ త్రైమాసికంలో మాత్రం 1.26 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.
ఆఫీసు స్పేస్ వినియోగం సగానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది. అదే సమయంలో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పుణె నగరాల్లో మంచి వృద్ధి రేటు నమోదైంది. హైదరాబాద్‌కు ఐటీ రంగం పరంగా ప్రధాన పోటీగా ఉన్న బెంగళూరులో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 4.14 మిలియన్ చదరపు అడుగులు లీజుకు తీసుకోవడం విశేషం. రాష్టంలో ప్రభుత్వం మారడంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతూ వస్తుందనడానికి ఆఫీసు స్పేస్ లీజింగ్ అంశమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.