-ఐటీ, ఫార్మా, తయారీ రంగాలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మా, తయారీ తదితర రంగాలకు గమ్యస్థానంగా ఉందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనియాడారు. తమ రాష్ట్రంలో కూడా ఈ రంగాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు భువనేశ్వర్‌లో మేక్ ఇన్ ఒడిశా కాంక్లేవ్‌ను నిర్వహించనున్నారు. దీన్ని విజయవంతం చేయాలంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ఆధ్వర్యంలో సోమవారం హోటల్ తాజ్ కృష్ణాలో ఇన్వెస్టర్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో 40 సంస్థల ప్రముఖులతో నవీన్ పట్నాయక్ వరుస సమావేశాలు చేపట్టారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో గనులు, సహజ వనరుల రంగాల్లో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలున్నాయని వివరించారు. కాగా, ఒడిశా పరిశ్రమల శాఖ మంత్రి ప్రతాప్ కేశారీ దేబ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రతోపాటు ఉన్నతాధికారుల బృందం ఆ రాష్ట్ర పారిశ్రామిక విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.