న్యూఢిల్లీ, జూలై 31: ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 7 కోట్లు దాటిందని ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. బుధవారం చివరి రోజు కావడంతో 50 లక్షలకు పైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి.
క్రితం ఏడాది దాఖలు చేసిన 6.77 కోట్ల కంటే 64.33 లక్షలు అధికం. గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ఐటీ శాఖ పలు కీలక చర్యలు తీసుకున్నది. ముఖ్యంగా 24 గంటలపాటు హెల్ప్‌డెస్క్, కాల్స్, లైవ్చాట్స్, వెబ్ఎక్స్ సెషన్, ట్విట్టర్/ఎక్స్ ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించింది.