న్యూఢిల్లీ, జూలై 4 : గడువుల మీద ఏ వాణిజ్య ఒప్పందానికీ ఏ దేశంతోనూ భారత్ దిగబోదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాతోనూ ఇంతేనన్న ఆయన.. జాతి ప్రయోజనాలకే తాము అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. అలాంటప్పుడే అగ్రరాజ్యంతోనైనా ప్రతిపాదిత ట్రేడ్ డీల్‌ను అంగీకరిస్తామని శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలకు ఇచ్చిన విరామం ఈ నెల 9తో ముగుస్తున్న క్రమంలో మంత్రి పైవిధంగా స్పందించారు. భారత ప్రయోజనాలకు తగ్గట్టుగా డీల్ ఉంటేనే అమెరికాకు తమ అంగీకారం తెలుపుతామని వెల్లడించారు. కాగా, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ఓ భారత బృందం ఏర్పాటైన విషయం తెలిసిందే. ఆటో రంగంలో 25 శాతం, ఉక్కు-అల్యూమినియం ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను ఈ చర్చల్లో భారత్ ప్రస్తావనకు తెస్తున్నది.
అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ), న్యూజీలాండ్, ఒమన్, చిలీ, పెరు తదితర దేశాలతోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్టు మంత్రి గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఆయా దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. అయితే ఇరువైపులా ప్రయోజనాలు ఉన్నప్పుడే ఎఫ్‌టీఏలు కుదురుతాయని గుర్తుచేశారు. ఇదిలావుంటే భారత్, నాలుగు ఐరోపా దేశాల కుటమి మధ్య ఎఫ్‌టీఏ.. రాబోయే రెండు నెలల్లో కుదిరే వీలుందని గోయల్ తెలిపారు.