Jet Airways | భారత విమానయాన రంగంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన జెట్ ఎయిర్వేస్ కథ ముగిసింది. జలాన్ కల్రాక్ కన్సార్టియంకు యాజమాన్య హక్కుల బదిలీ ప్రణాళికపై ట్రిబ్యునల్ ఆదేశాలను దేశ అత్యున్నత న్యాయస్థానం పక్కన బెట్టింది. జెట్ ఎయిర్వేస్ రుణ దాతలకు పూర్తిగా బకాయిలు చెల్లించకుండానే యాజమాన్య హక్కుల బదిలీపై ప్రతిష్టంభన నెలకొంది. రుణదాతలు అమలు చేసిన వేలం ప్రక్రియలో బిడ్ గెలుచుకున్న జలాన్ కల్రాక్ కన్సార్టియం రుణ బకాయిలు చెల్లించడంలో విఫలమైంది. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగంలోని 142 అధికరణం ప్రకారం తనకు కల్పించిన అసాధారణ అధికారాలను ఉపయోగించుకున్నది సుప్రీంకోర్టు. సదరు జెట్ ఎయిర్వేస్ ఆస్తులు విక్రయించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని త్రిసభ్య బెంచ్ ఆమోదించింది.
ఎన్సీఎల్టీ ముందు రిజొల్యూషన్ ప్లాన్ అమలు చేయడంలో విఫలమైనందున మరో చాయిస్ లేక పోవడంతో ఆస్తులు విక్రయించి రుణ దాతల బకాయిలు, ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించాలని ఆదేశిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంకుతోపాటు పలు బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రుణదాతలకు బకాయిలు చెల్లించకున్నా యాజమాన్య హక్కులను జలాన్ కల్రాక్ కన్సార్టియంకు బదిలీ చేయాలన్న ఎన్సీఎల్టీ ఆదేశాలను న్యాయస్థానం పక్కన బెట్టింది.
రిజొల్యూషన్ ప్లాన్ ప్రకారం బకాయిలు చెల్లించకుండానే యాజమాన్య హక్కులు బదిలీ చేయాలని మార్చి 12న ఎన్సీఎల్టీ తీసుకున్న నిర్ణయాన్ని రుణ దాతలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రిజొల్యూషన్ ప్లాన్ లో భాగంగా ఇనిషియల్ గా రూ.350 కోట్లు చెల్లించడంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం విఫలమైంది. కన్సాయం పూర్తిగా రూ.4783 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్ ను నియమించాలని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.