RBI | కస్టమర్ల నిరుపయోగమైన (ఇన్ ఆపరేటివ్) ఖాతాలపై ఎటువంటి చార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకర్లను ఆర్బీఐ ఆదేశించింది. ఇన్ ఆపరేటివ్ ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోయినా, రెండేండ్లకు పైగా లావాదేవీలు నిర్వహించకపోయినా చార్జీలు వసూలు చేయొద్దని సూచించింది. సదరు బ్యాంకు ఖాతాలు విద్యార్థుల స్కాలర్ షిప్‌లు, నగదు బదిలీ పథకం (డీబీటీ) స్వీకరించడానికి తెరిచి ఉంటే, చార్జీలు వసూలు చేయొద్దని సూచించింది. అన్ క్లయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్ల మనీ తగ్గించడానికి చర్యలు చేపట్టాలని పేర్కొంటూ బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు చేసింది. సవరించిన సూచనలు, నిబంధనలు వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
రోజురోజుకు పెరిగిపోతున్న అన్ క్లయిమ్డ్ డిపాజిట్లను సంబంధిత ఖాతాదారులకు గానీ, వారి నామినీలు, వారసులకు గాని రిటర్న్ చేసేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. అందుకోసం ఖాతాదారులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, లేఖల ద్వారా సమాచారం ఇవ్వాలని తెలిపింది. ఖాతాదారుల నామినీలతోనూ సంప్రదింపులు జరుపాలని సూచించింది.
2022 మార్చి నెలాఖరు నాటికి రూ.32,934 కోట్లుగా ఉన్న అన్ క్లయిమ్డ్ డిపాజిట్లు, 2023 మార్చి నెలాఖరు నాటికి రూ.42,272 కోట్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది. పదేండ్లు, అంతకంటే ఎక్కువ కాలం వాడకంలో లేని ఖాతాల్లోని డిపాజిట్లను ఆర్బీఐ డిపాజిటర్ అండ్ ఎడ్యుకేషన్ అవేర్ నెస్ ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది.