Budget 2023-24 | బంగారం అంటే భారతీయులు.. అందునా మహిళలకు ఎంతో ఇష్టం. కానీ.. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ మాత్రం.. తోటి మహిళలకు మాత్రం రిలీఫ్ ఇవ్వడంలో విఫలం అయ్యారు. డిజిటల్ గోల్డ్ క్రయ విక్రయాలకు ప్రోత్సాహం కల్పించడానికి కేంద్ర మంత్రి ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, బంగారం కొనుగోలుపై పన్ను రాయితీ కల్పించలేకపోయారని ప్రపంచ స్వర్ణ మండలి భారత్ సీఈవో సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు.
`బంగారంపై కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం సరైన చర్య. కానీ, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ – వ్యవసాయ రంగ మౌలిక వసతుల అభివృద్ధి (ఏఐడీసీ) పెంపుతో ఓవరాల్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతం యథాతథంగానే ఉంది` అని సోమసుందరం పీఆర్ తెలిపారు.
గతేడాది 2022-23 బడ్జెట్లో నిర్మలా సీతారామన్.. కట్ లేదా పాలిష్డ్ డైమండ్లపై దిగుమతి సుంకం 7.5 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించి వజ్రాల వ్యాపారులకు రిలీఫ్ కల్పించారు. కానీ బంగారంపై దిగుమతి సుంకం యధాతథంగా కొనసాగించడం బులియన్ మార్కెట్ వర్గాలను నిరుత్సాహ పరిచింది. ఇదిలా ఉంటే ఇంతకుముందు అమల్లో ఉన్న బంగారం దిగుమతి సుంకం 10.75 నుంచి 15 శాతానికి పెంచుతూ గత జూలైలో కేంద్రం నిర్ణయం తీసుకున్నది. బంగారంపై బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ) 7.5 నుంచి 12.5 శాతానికి పెంచారు. ఏఐడీసీ యధాతథంగా 2.5 శాతంగా కొనసాగించారు.
ఫిజికల్ గోల్డ్‌ను డిజిటల్ గోల్డ్‌గా మార్చుకునేందుకు ముందుకు వస్తే క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణించబోమని, అలా మార్చిన బంగారం విలువపై పన్ను విధించబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. `ఫిజికల్ గోల్డ్‌ను ఎలక్ట్రానిక్ గోల్డ్‌గా మార్చుకుంటే దాన్ని ట్రాన్స్‌ఫర్‌గా గుర్తించరు. ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ పరిధిలోకి రాదు. దీన్ని ఎలక్ట్రానిక్ ఈక్విలెంట్ గోల్డ్‌లో ఇన్వెస్ట్మెంట్ల ప్రోత్సాహంగా పరిగణిస్తారు` అని చెప్పారు.