న్యూఢిల్లీ, జూలై 16: కేంద్ర బడ్జెట్ తయారీ తుది దశకు చేరిందనడానికి సంకేతంగా నిలిచే హల్వా వేడుకను మంగళవారం ఇక్కడి నార్త్ బ్లాక్ బేస్మెంట్లో ఆర్థిక శాఖ నిర్వహించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు సహాయ మంత్రి పంకజ్ చౌధరి, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు, బడ్జెట్ కూర్పులో పాలుపంచుకున్న సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్మలా సీతారామన్ స్వయంగా అందరికీ వడ్డించారు. ఏటా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఈ హల్వా వేడుకను జరుపడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారీ చేపట్టారు. ఈ నెల 23న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కుగాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. నిజానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రకటిస్తారు. అయితే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల కారణంగా నాడు తాత్కాలిక బడ్జెట్‌నే తెచ్చారు. దీంతో అసలు బడ్జెట్ వచ్చేవారం రాబోతున్నది.
గత మూడు బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ తరహాలోనే ఈసారీ పేపర్‌లెస్ (డిజిటల్) బడ్జెట్‌నే తేనున్నారు. కేంద్ర బడ్జెట్‌కు చెందిన అన్ని డాక్యుమెంట్లు, వార్షిక ఆర్థిక నివేదిక, డిమాండ్ ఫర్ గ్రాంట్లు, ఆర్థిక బిల్లు మొదలైనవన్నీ ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’లో అందుబాటులో ఉంటాయి. కాగా, హల్వా వేడుకకు ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి హాజరయ్యారు. నార్త్ బ్లాక్ బేస్మెంట్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్లోనే బడ్జెట్ ప్రతులు ముద్రణవుతాయి. 1980 నుంచి 2020 వరకు 40 ఏండ్లపాటు ఇక్కడే ప్రింటింగ్ అయ్యాయి. అయితే ఆ తర్వాతి నుంచి పేపర్‌లెస్ బడ్జెట్‌ను మోదీ సర్కారు తీసుకొచ్చిన సంగతి విదితమే.