Nirmala Sitaraman | కేంద్రంలోని నరేంద్రమోదీ క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌కు తిరిగి ఆర్థిక శాఖను కట్టబెట్టారు. మోదీ 2.0 మంత్రివర్గంలో ఐదేండ్ల పాటు విజయవంతంగా ఆర్థికశాఖను నిర్వహించిన నిర్మలా సీతారామన్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. 2014లో తొలి మోదీ మంత్రి వర్గంలో వాణిజ్యం, రక్షణ శాఖలు నిర్వహించారు. గతంలో కొద్ది కాలం పాటు ఇందిరాగాంధీ ఆర్థిక శాఖ నిర్వహించినా, ప్రధాని కావడంతో తర్వాత వేరే వారికి కేటాయించారు. ఇక దేశ చరిత్రలో ఒక మహిళా నాయకురాలికి ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటాయించడం ఇదే రికార్డు.
మధ్యప్రదేశ్ లోని గుణ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతిరాదిత్య సింధియాకు టెలీ కమ్యూనికేషన్ల శాఖను కేటాయించారు ప్రధాని మోదీ. మోదీ 2.0 మంత్రి వర్గంలో 2021 నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు 2004-14 మధ్య యూపీఏ ప్రభుత్వ హయాంలో పలు శాఖలను నిర్వహించిన అనుభవం కలిగి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడుకు ప్రధాని నరేంద్రమోదీ పౌర విమానయాన శాఖ కేటాయించారు. అంతకు ముందు 2014లో మోదీ తొలి ప్రభుత్వ హయాంలో విజయ నగరం నుంచి లోక్ సభకు ఎన్నికైన పీ అశోక్ గజపతి రాజుకు పౌర విమానయానం కేటాయించారు. పదేండ్ల తర్వాత మరో టీడీపీ నేతకే మళ్లీ మోదీ.. పౌర విమానయాన శాఖ కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.