కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాల్ని తగ్గించడం, ఎగుమతి సుంకాల్ని పెంచడంతో మెటల్ షేర్లు పతనమై సూచీల్ని గతవారం ఒడిదుడులకు లోనుచేశాయి. అయినప్పటికీ నిఫ్టీ వారం మొత్తంమీద 86 పాయింట్లు లాభపడి 16,352 పాయింట్ల వద్ద నిలిచింది. మే నెల డెరివేటివ్ సిరీస్ ముగింపు రోజైన ఈ నెల 26న..నిఫ్టీ గత వారం సూచించిన 15,900 పాయింట్లపైన నిలదొక్కుకోవడంతో వెనువెంటనే కోలుకోగలిగింది.
పలు ప్రధాన వర్థమాన మార్కెట్లలో సైతం బాటమింగ్ ఫార్మేషన్లు కన్పిస్తున్నాయని, మరో వైపు ఇక్కడ బ్యాంక్ ఇండెక్స్ రైజింగ్ చానల్ సపోర్ట్‌తో బౌన్స్ అయ్యిందని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ క్షీణించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ఇన్వెస్టర్లు బుల్లిష్ భావనను కొనసాగించవచ్చని సూచిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఈ నెల 31న, ఆటో కంపెనీల అమ్మకాల డాటా జూన్1న వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్ కొంతమేర హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని మరో విశ్లేషకుడు హెచ్చరించారు.
ఈ వారం నిఫ్టీకి 16,400-16,500 పాయింట్ల శ్రేణి కీలకమైనదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 16,400 బ్రేక్చేస్తే సూచీ 16,800-900 స్థాయి వరకూ పెరగవచ్చని జిమిత్ మోదీ అంచనా వేశారు. దిగువన 15,700 స్థాయే గట్టి మద్దతును అందించవచ్చన్నారు. నిఫ్టీకి తక్షణం 16,400 పాయింట్ల వద్ద అవరోధం ఉందని, అటుపైన 16,480-16,650 పాయింట్ల గ్యాప్ ఏరియాను దాటితేనే ట్రెండ్ బుల్లిష్‌గా మారుతుందని ఏంజిల్ ఒన్ చీఫ్ అనలిస్ట్ సమీత్ చవాన్ తెలిపారు.
రెండు వారాలుగా నిఫ్టీ 15,700-16,400 శ్రేణి మధ్య కన్సాలిడేట్ అవుతూ ప్రస్తుతం అప్పర్ ఎడ్జ్ వద్ద నిలిచిందని, 50 వారాల మూవింగ్ ఏవరేజ్ కదులుతున్న 16,918 పాయింట్లస్థాయిని చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చార్ట్ విజార్డ్ వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ విశ్లేషించారు. అయితే ముందుగా 16,450-16,625 శ్రేణిని అధిగమిస్తేనే ఇది సాధ్యపడుతుందన్నారు. డబుల్ బాటమ్ సపోర్ట్ జోన్ 15,670-15,750 శ్రేణిని పరిరక్షించుకున్నంతవరకూ నిఫ్టీ పుల్‌బ్యాక్ ర్యాలీ కొనసాగే ఛాన్స్ ఉందన్నారు.