న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 ఇండెక్స్ 2022లో మరింత పెరుగుతుందని, 20,800 పాయింట్ల రికార్డు స్థాయిని చేరుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రస్తుతం నిఫ్టీ 17,000 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. దీంతో మరో 23 శాతం ఎగబాగవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు పెరిగిన గత రెండు సందర్భాల్లోనూ ఇతర ఆస్తుల కంటే ఈక్విటీలే బాగా పెరిగాయని గుర్తుచేశారు. 2003-07 మధ్యకాలంలోనూ, 2013 తర్వాత వడ్డీరేట్లను పెంచినప్పుడు స్టాక్ సూచీలు ర్యాలీ జరిపాయని వివరించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున అంతర్జాతీయ కేంద్ర బ్యాంక్‌లు వడ్డీరేట్ల పెంపుదలకు సిద్దమవుతున్నాయని, ఇప్పుడు కూడా.. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద ర్యాలీ రావచ్చు అన్నారు.
ప్రత్యామ్నాయాలు లేవు..
అధిక ద్రవ్యోల్బణం కారణంగా బాండ్ల పెట్టుబడుల్లో మరింత రాబడులు వచ్చే అవకాశం లేదని, కమోడిటీలు పెరిగినప్పటికీ అవి ఇన్వెస్టర్లకు పెద్దగా లాభాలివ్వలేకపోయాయని, కమోడిటీల ధరలు మరింత పెరగకుండా చైనా అడ్డుకుంటున్నదని ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనాల్లో పేర్కొంది. మరోవైపు గత పదేండ్లలో భారత్, అమెరికాల్లో ఈక్విటీ పెట్టుబడులు 250 శాతం లాభాల్ని ఇచ్చాయన్నది. ఈ కారణంగా రాబడులకు ఈక్విటీలను మించిన ప్రత్యామ్నాయం లేదని, వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఈక్విటీ పెట్టుబడులే మంచిదని విశ్వసిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
3 రోజుల ర్యాలీకి బ్రేక్
వరుసగా మూడు రోజులు జరిగిన స్టాక్ మార్కెట్ ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, విద్యుత్ షేర్లలో అమ్మకాలు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 191 పాయింట్లు క్షీణించి 57,124 పాయింట్ల వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 69 పాయింట్లు తగ్గి 17,004 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లు 1.15 శాతం నష్టపోయాయి.