ముంబై, జూన్ 20: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. తీవ్ర ఊగిసలాటలో ట్రేడింగ్ జరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. మదుపరులు తిరిగి కొనుగోళ్ళకు మొగ్గుచూపడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలు లాభాల్లోకి రావడానికి పరోక్షంగా దోహదం చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 237.42 పాయింట్లు లాభపడి 51,597.84 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,061 పాయింట్ల- 51,715 పాయింట్ల శ్రేణిలో ట్రేడింగ్ జరిగాయి. మరోవైపు, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 56.65 పాయింట్లు అందుకొని 15,350.15 వద్ద స్థిరపడింది.
హెచ్‌యూఎల్ 4 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది.
వీటితోపాటు హెచ్డీఎఫ్సీ, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు భారీగా లాభపడ్డాయి.
మరోవైపు, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎస్బీలు నష్టపోయాయి.
బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 2.95 శాతం, బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.39 శాతం చొప్పున పతనం చెందాయి.
రంగాలవారీగా చూస్తే మెటల్ 4.46 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 3.48 శాతం, ఎనర్జీ 3.26 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.14 శాతం పతనం చెందగా..కేవలం ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఐటీ, టెక్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.
మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి.
ఆసియాలోని టోక్యో, సియోల్, షాంఘైల షేర్లు పతనమవగా, కేవలం హాంకాంగ్ సూచీ లాభాల్లో ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ స్వల్పంగా పెరిగి 113.2 డాలర్లు పలికింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి 77.98 వద్ద నిలిచింది.