Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మీడియా, చమురు రంగాల సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 85,008.93 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. పొద్దంతా లాభాల్లో మార్కెట్లు కొనసాగగా.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఇంట్రాడేలో ఒక దశలో 85,110.24 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. అత్యల్పంగా 84,536.73 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. సెన్సెక్స్ చివరకు 313.70 పాయింట్లు తగ్గి.. 84,587.01 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 74.70 పాయింట్లు పతనమై.. 25,884.80 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్ సూచీలు కీలక సూచీల కంటే మెరుగైన పనితీరును కనబరిచాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్ప లాభంతో ముగిశాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ నిఫ్టీలో ప్రధాన లాభాలను ఆర్జించాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్, టీఎంవీపీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్ నష్టపోయాయి. మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ 0.5శాతం నుంచి ఒకశాతం వరకు పెరిగాయి. అయితే కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, మీడియా, ఆయిల్, గ్యాస్ 0.5శాతం చొప్పున తగ్గాయి. సీఈవో రాజీనామా తర్వాత యాత్రా ఆన్లైన్ షేర్లు ఒకశాతం పడిపోయాయి. బైట్ ఎక్లిప్స్ టెక్నాలజీస్ ఇంక్‌తో జేవీలో బ్లూ క్లౌడ్ స్టాఫ్ట్ టెక్ షేర్లు 3శాతం తగ్గాయి. 1.26శాతం ఈక్విటీ బ్లాక్ డీల్‌పై రియలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 4శాతం తగ్గాయి. బ్లాక్ డీల్ తర్వాత అశోక్ లేలాండ్ షేర్లు ఒకశాతం పెరిగాయి. రూ.389.97 కోట్ల ఆర్డర్‌తో ట్రాన్స్ఫార్మర్స్, రెక్టిఫైయర్స్ షేర్ ధర 4శాతం పెరిగింది. రూ.220 కోట్ల ఆర్డర్ కారణంగా నీరజ్ సిమెంట్ షేర్ ధర దాదాపు 9శాతం వృద్ధి చెందింది. ఫెడరల్ బ్యాంక్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, ముత్తూట్ ఫైనాన్స్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్ వంటి దాదాపు 80 స్టాక్‌లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి.