ముంబై, సెప్టెంబర్ 18: స్టాక్ మార్కెట్ల జైత్రయాత్రకు బ్రేక్‌పడింది. గత కొన్ని రోజులుగా రికార్డుల మీద రికార్డులు సృష్టించిన సూచీలు జారుకున్నాయి. ప్రారంభంలో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న సూచీలు చివర్లో ఐటీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో నష్టాల్లోకి పడిపోయింది. వడ్డీరేట్ల తగ్గింపుపై అమెరికా ఫెడరల్ రిజర్వు తీసుకునే నిర్ణయంపై మదుపరులు వేచిచూసే దోరణి అవలభించారు. దీంతో ప్రారంభంలో 246 పాయింట్లు పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 83 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 131.43 పాయింట్లు కోల్పో యి 82,948.23 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 25,377.55 వద్ద స్థిరపడింది.
ఐటీ సంస్థల షేర్లు కుదేలయ్యాయి. ఐటీ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 3.49 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు హెచ్‌సీఎల్ టెక్ 3.15 శాతం, ఇన్ఫోసిస్ 3.09 శాతం, టెక్ మహీంద్రా 2.79 శాతం నష్టపోయాయి. వీటితోపాటు సన్‌ఫార్మా, టాటా స్టీల్, టాటా మోటర్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌గ్రిడ్, రిలయన్స్, ఎన్టీపీసీ, ఎయిర్టెల్, మారుతి, కొటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. కానీ, బజాజ్ ఫైనాన్స్, నెస్లె, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్‌లు లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ 3 శాతం, టెక్నాలజీ 2.43 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.12 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్, మెటల్, కమోడిటీస్ షేర్లు నష్టపోగా..ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ రంగ సూచీ లాభాల్లో ముగిసింది.