Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) సోమవారం నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా (West Asia) లో మళ్లీ తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీనికితోడు ఆటో, ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ స్టాక్స్ (Banking stocks) లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 372.10 పాయింట్లు నష్టపోయి 76,728.37 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 109.75 పాయింట్లు క్షీణించి 23,946.25 వద్ద ముగిసింది.
అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనలతో ట్రేడర్లు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడారు. దాంతో దాదాపు అన్ని రంగాల్లోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు ప్రధాన నష్టాల్లో ఉన్నాయి. సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. నిఫ్టీకి 24,000 కీలక నిరోధంగా మారింది. దీనిని దాటితే 24,100-24,200 స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక దిగువన 23,900 తక్షణ మద్దతుగా, 23,800 బలమైన మద్దతుగా పనిచేస్తుందని వారు తెలిపారు.
ఇవాళ ట్రేడింగ్‌లో ఫార్మా, మెటల్, హెల్త్‌కేర్ రంగాలు రాణించగా.. ఆటో, కెమికల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు అత్యధికంగా నష్టపోయాయి. బ్రాడర్ మార్కెట్లలోనూ మిడ్‌క్యాప్ సూచీ 0.37 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.62 శాతం మేర నష్టపోయాయి. రాబోయే రోజుల్లో పశ్చిమాసియా పరిణామాలు, ఇతర అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.