శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 21, 2021 , 18:33:16

పీఎఫ్‌లో ఉద్యోగుల వాలంట‌రీ డిపాజిట్ల‌పైనా ప‌న్నుమోతే!

పీఎఫ్‌లో ఉద్యోగుల వాలంట‌రీ డిపాజిట్ల‌పైనా ప‌న్నుమోతే!

న్యూఢిల్లీ: వ‌చ్చే ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ఉద్యోగుల భ‌విష్య‌నిధి (పీఎఫ్‌) డిపాజిట్ల వ‌డ్డీపై ప‌న్ను వ‌సూళ్లు ప్రారంభం కానున్నాయి. పీఎఫ్‌లో స‌బ్‌స్క్రైబ‌ర్లు, ఉద్యోగుల వార్షిక కంట్రీబ్యూష‌న్ రూ.2.5 ల‌క్ష‌లు దాటితే.. స‌ద‌రు డిపాజిట్ల వ‌డ్డీపై ప‌న్ను అమ‌లులోకి రానున్న‌ది.  సాధారణంగా ఉద్యోగ భ‌విష్య‌నిధి (ఈపీఎఫ్‌) ఖాతాలో ప్ర‌తి నెలా ఉద్యోగి బేసిక్ వేత‌నంలో 12 శాతం, యాజ‌మాన్యం మ‌రో 12 శాతం జ‌మ‌చేస్తాయి. 

అయితే, ప‌న్ను మినహాయింపులు పొంద‌డానికి ఈపీఎఫ్ ఖాతాల్లో సొంతంగా జ‌మ చేస్తున్న అధిక ఆదాయ సంపాద‌న‌ప‌రులను క‌ట్ట‌డి చేయ‌డానికే ఈ ప‌న్ను అమ‌లులోకి తేవాల‌ని కేంద్రం భావిస్తున్న‌ది. కేంద్ర ఆర్థిక‌శాఖ‌లో ఎక్స్‌పెండిచ‌ర్ కార్య‌ద‌ర్శి టీవీ సోమ‌నాథ‌న్ ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఈపీఎఫ్ ఖాతాల్లో రూ.2.5 ల‌క్ష‌ల‌కు పైగా జ‌మ చేస్తున్న వారు మొత్తం ఈపీఎఫ్ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌లో ఒక‌శాతానికి లోపే ఉంటార‌ని చెప్పారు. . 

‘అధిక సంపాద‌న‌ప‌రుల‌కు ప‌న్ను మిన‌హాయింపు నుంచి హేతుబ‌ద్ధీక‌రించ‌డానికే వివిధ పీఎఫ్ ఖాతాల్లో ఉద్యోగుల వార్షిక కాంట్రిబ్యూష‌న్ రూ.2.5 ల‌క్ష‌లు దాటితే.. దానిపై వ‌చ్చే వ‌డ్డీమీద ప‌న్ను వ‌సూలు చేస్తాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ త‌న బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. కేంద్ర నిర్ణ‌యం అధిక సంపాద‌న‌ప‌రులు, హై నెట్‌వ‌ర్త్ ఇండివిడ్యూయ‌ల్స్ (హెచ్ఎన్ఐ)పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.


అధిక సంపాద‌న ప‌రులు, హెచ్ఎన్ఐలు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌డానికి ఈపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము భారీగా జ‌మ చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. హెచ్ఎన్ఐల‌తోపాటు త‌మ భ‌విష్య‌త్‌ను ద్రుష్టిలో పెట్టుకుని ఉద్యోగులు స్వ‌చ్ఛందంగా త‌మ పీఎఫ్ ఖాతాల్లో 12 శాతానికి ఎక్కువ సొమ్ము జ‌మ చేసిన వారికీ ఈ ప‌న్ను వ‌ర్తిస్తుంది.

ఇక బేసిక్ వేత‌నంలో 12 శాతం జ‌మ చేసినా.. ఆ మొత్తం రూ.2.5 ల‌క్ష‌లు దాటినా ప‌న్ను చెల్లింపులు త‌ప్ప‌వు.పీఎఫ్ ఖాతాల నుంచి విత్‌డ్రాయ‌ల్స్‌కు ఈ ప‌న్ను మోత ఉండ‌దు. పీఎఫ్ వ‌డ్డీపై ప‌న్ను వ‌డ్డింపుల వివ‌రాల‌ను త‌ర్వాత వెల్ల‌డిస్తామ‌ని ప్ర‌క‌టించిన కేంద్రం.. ఆ వివ‌రాల‌ను ఇంకా బ‌హిర్గ‌తం చేయలేదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo