Maruti Suzuki DZire | న్యూఢిల్లీ, నవంబర్ 11: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ సరికొత్త మాడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కాంప్యాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా నయా డిజైర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు రూ.6.79 లక్షలు మొదలుకొని రూ.10.14 లక్షల గరిష్ఠ స్థాయిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. నాలుగో జనరేషన్గా విడుదల చేసిన ఈ కారు నాలుగు రకాల్లో లభించనున్నది.
1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మాడల్ మాన్యువల్ గేర్‌బాక్స్ కారు 24.79 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా, ఏఎంటీ బాక్స్ మాడల్ 25.71 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. అలాగే త్వరలో అందుబాటులోకి రానున్న సీఎన్జీ మాడల్ కిలోకు 33.73 కిలోమీటర్లు మైలేజీ ఇవ్వనున్నది. టిగోర్, అమేజ్, హ్యుందాయ్ ఔరాలకు పోటీగా సంస్థ ఈ వాహనాన్ని విడుదల చేసింది.
ఈ సందర్భంగా మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాషీ టకేచి మాట్లాడుతూ..భారత్‌లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత పెంచాలనే ఉద్దేశంతో ఈ నయా మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ డిజైర్ కార్లు 30 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ నయా మాడల్‌ను కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దడానికి రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు.