Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆకాశమే హద్దుగా పరుగులుపెట్టిన ఐటీ, ఐటీ ఆధారిత రంగాల దూకుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. బీఆర్ఎస్ పాలనలో నిరుడు అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.57,706 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. అదే సమయంలో 1,27,594 కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. 2023-24లో ఐటీ ఎగుమతుల విలువ రూ.26,948 కోట్లకే పరిమితమైంది. కొత్త ఉద్యోగాలు కేవలం 40,285గా నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే, ఇది చాలా తక్కువ.
2022-23లో ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో వృద్ధిరేటు 31.4% నమోదు కాగా, 2023-24లో అది 11.2 శాతానికే పరిమితమైనట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. కరోనా సమయంలో 2020-21లో తెలంగాణ 13% వృద్ధిరేటును నమోదు చేసి దేశంలోనే ఆగ్రస్థానంలో నిలిచింది. 2023-24లో ఐటీ ఎగుమతుల వృద్ధిరేటు కరోనా ఏడాది నమోదైన వృద్ధిరేటు కంటే దిగువకు పడిపోవడం గమనార్హం.
తెలంగాణలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పన క్షీణించడంపై బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తంచేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో క్షీణతకు సంబంధించిన గణంకాలను తాజాగా ఆయన ట్వీట్ చేశారు. ఐటీ ఎగుమతులు రూ.57,706 కోట్ల నుంచి రూ.26,948 కోట్లకు దిగజారడం, కొత్త ఉద్యోగాల కల్పన 1,27,594 నుంచి 40,285కి పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తంచేశారు.గత ఆరేడేండ్లలో తెలంగాణలో ఐటీ ప్రగతి గణనీయంగా పెరిగేందుకు గత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని కేటీఆర్ గుర్తు చేశారు. సింగిల్ విండో విధానం, టీఎస్ ఐపాస్, ఐటీ రంగానికి సంబంధించి ప్రభుత్వ పాలసీల కారణంగా అత్యంత వేగంగా హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని వివరించారు. హైదరాబాద్‌ను దేశానికి ఐటీ కేంద్రంగా చేసేందుకు ఎంతో కృషి చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఐటీ రంగం పురోగతి ఎంతో మేలు చేసిందని గుర్తు చేశారు. ఐటీ రంగాన్ని పట్టించుకోకపోతే రాష్ట్రం ఆర్థికంగా, ఉపాధి కల్పన పరంగా నష్టపోయే పరిస్థితి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఐటీతోపాటు ఐటీఈఎస్ రంగాలకు ప్రాముఖ్యం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐటీ రంగం పుంజుకోవాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించాలని, ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ కంపెనీలకు అన్ని విధాలుగా మద్దతు ఇచ్చి ఐటీ రంగానికి ఉపయోగపడే విధానాలు కొనసాగించాలని సలహా ఇచ్చారు. ఐటీ సంస్థలు మరిన్ని పెరగాలంటే ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలను పెంచుతూనే శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించారు. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం నిరంతరం దృష్టి పెట్టాలని కోరారు.