న్యూఢిల్లీ, మార్చి 19: బంగారం ధరలు రోజుకో రికార్డును నెలకొల్పుతున్నాయి. దేశీయ మార్కెట్లో బుధవారం మరో సరికొత్త స్థాయిని గోల్డ్ రేటు అందుకున్నది. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.92 వేలను సమీపించింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో ఏకంగా రూ.91,950గా నమోదైంది. మంగళవారం ముగింపుతో పోల్చితే రూ.700 ఎగిసింది. గత 6 రోజులుగా ధరలు పెరుగుతూనే ఉండగా.. ఈ మూడు రోజుల్లోనే తులం రూ.2,500 ఎగబాకడం గమనార్హం.
హైదరాబాద్‌లోనూ బంగారం రేట్లు పరుగులు పెడుతున్నాయి. అయితే ఢిల్లీతో పోల్చితే కాస్త తక్కువగానే ఉంటున్నాయి. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత లేదా ఆభరణాల బంగారం) 10 గ్రాములు రూ.82,900గా ఉన్నది. 24 క్యారెట్ రూ.90,440 పలికింది. మంగళవారంతో చూస్తే.. వరుసగా రూ.400, రూ.440 పుంజుకున్నాయి. పెండ్లిళ్ల సీజన్ దగ్గరకొస్తుండటంతో హోల్‌సేల్ జ్యుయెల్లర్స్, రిటైల్ వ్యాపారులు, కస్టమర్ల నుంచి డిమాండ్ కనిపిస్తున్నదని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల నడుమ అటు ఇన్వెస్టర్ల నుంచీ ఆదరణ పెరగడంతో ధరలు దౌడు తీస్తున్నాయని ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మార్కెట్లో బంగారంతోపాటు వెండి ధరలూ విజృంభిస్తున్నాయి. కిలో వెండి ధర రూ.1,000 అందుకొని ఆల్‌టైమ్ హై రికార్డును సృష్టిస్తూ రూ.1,03,500 పలికింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.2,300 పుంజుకోవడం విశేషం. సాధారణ కస్టమర్లతోపాటు పారిశ్రామిక వర్గాల నుంచి ఆదరణ లభిస్తుండటం ధరలను ఎగదోస్తున్నదని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు.
గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం 3,039.22 డాలర్లుగా నమోదైంది. ఒకానొక దశలో మునుపెన్నడూ లేనివిధంగా 3,045.39 డాలర్లుగా నమోదవడం గమనార్హం. ఇక ఫ్యూచర్స్ ట్రేడ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ డెలివరీకి రూ.88,745 పలికింది.