Small Savings | ప్రతి ఒక్కరూ తమ కుటుంబం.. పిల్లల భవిష్యత్ కోసం తమ ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. ప్రభుత్వాలు సైతం ప్రజల్లో పొదుపును ప్రోత్సహిస్తుంటాయి. ఇందుకోసం పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్.. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు.. రికరింగ్ డిపాజిట్ పథకాలు అమలు చేస్తున్నాయి. అమ్మాయిల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేర్వేరుగా పొదుపు పథకాలను నిర్వహిస్తున్నాయి. కానీ, గత ఆర్థిక సంవత్సరం 2022-23లో గత 11 ఏండ్లలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), పీపీఎఫ్, పోస్టాఫీసు డిపాజిట్ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు తగ్గిపోయాయి.
2021-22తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం పెట్టుబడులు తగ్గాయి. 2021-22లో రూ.3.33 లక్షల కోట్ల పెట్టుబడులు మదుపు చేస్తే, 2022-23లో రూ.3.04 లక్షల కోట్లు మాత్రమే ప్రజలు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేశారు.
2022-23 జనవరి- మార్చి త్రైమాసికంలో చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేటు 1.10 శాతం పెంచింది. ఏడాది గడువు మొదలు రెండేండ్లు, మూడేండ్ల గడువు గల చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వడ్డీరేటు 6.6 శాతం, 6.8 శాతం, 6.9 శాతం పెరిగాయి.
కానీ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగలేదు. గత ఆర్థిక సంవత్సరంలో పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా చిన్న మొత్తాల పథకాల్లో పెట్టుబడులు పెట్టారు. వీటితోపాటు బీహార్, ఛత్తీస్‌ఘడ్, పుదుచ్చేరి, అసోం, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో నికర వసూళ్లు గరిష్టంగా పెరిగాయి. దాద్రానగర్ హవేలీ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నికర చిన్న మొత్తాల పొదుపు పథకాల వసూళ్లు తగ్గాయి.
మ్యూచువల్ ఫండ్స్: మ్యూచువల్ ఫండ్స్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్లు రూ.70,199 కోట్లు మదుపు చేస్తే, 2022-23లో రూ.68,321 కోట్లకే పరిమితం అయ్యారు.
ఈక్విటీ మార్కెట్లు : నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో రిటైల్ ఇన్వెస్టర్ల టర్నోవర్ 2021-22లో 40.7 శాతం పెరిగితే, 2022-23లో 36.5 శాతం పతనమైంది.