హైదరాబాద్, నవంబర్ 10 : రాష్ర్టానికి చెందిన ప్రముఖ డయాలసిస్ సేవల సంస్థ నెఫ్రొకేర్ హెల్త్ సర్వీసెస్ ఐపీవోకి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తాజా ఈక్విటీ షేర్లను జారీచేయడంతో రూ.353.4 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూట్లో ప్రమోటర్లు, వాటాదారులకు సంబంధించి మరో 1.2 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించనున్నది. షేర్లు హోల్డర్లలో భాగంగా ఇండియా ప్రైవేట్ ఈక్విటీ లిమిటెడ్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, 360 వన్ స్పెషల్ ఆపర్చ్యూనిటీ ఫండ్-సిరీస్ 9, 360 వన్ స్పెషల్ ఆపర్చ్యూనిటీ ఫండ్-సిరీస్ 11 కంపెనీలకు చెందిన షేర్లను విక్రయించనున్నారు.
ఐపీవో ద్వారా సేకరించిన నిధుల్లో రూ.129.1 కోట్లను నూతన డయాలసిస్ క్లీనిక్స్‌ను నెలకొల్పడానికి, మరో రూ.136 కోట్లను రుణాలను తిరిగి చెల్లించడానికి వినియోగించనున్నట్టు ప్రకటించింది. 2009లో ప్రారంభమైన సంస్థ తన డయాలసిస్ సెంటర్లను 500కి విస్తరించింది. దీంతోపాటు కమర్షియల్ రెన్యూబుల్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్ క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ ఐపీవోకి కూడా అనుమతినిచ్చింది. ఈ రెండు సంస్థలు కలిసి రూ.5,553 కోట్ల వరకు నిధులు సమీరించనున్నాయి. దీంట్లో క్లీన్ మ్యాక్స్ రూ.5,200 కోట్ల నిధులు సమీకరించనున్నది. ఇరు సంస్థలో ఆగస్టు నెలలో ఐపీవోకి దరఖాస్తు చేసుకోగా..అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4 వరకు పరిశీలించిన తర్వాత చివరగా అనుమతినిచ్చింది.