RBI-Rs 2000 | ఇంకా ప్రజల వద్ద రూ.6,970 కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. 2023 మే 19న రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. నాటి నుంచి ఇప్పటి వరకూ 98.04 శాతం రూ.2000 నోట్లు బ్యాంకింగ్ సిస్టమ్ లోకి తిరిగి వచ్చాయని సోమవారం వెల్లడించింది. 2023 మే 19 న మొత్తం దేశంలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. గత నెల 31 నాటికి దేశంలో చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.6,970 కోట్లు. 2023 మే 19న చలామణిలో ఉన్న నోట్లతో పోలిస్తే గత నెల 31 నాటికి 98.04 శాతం రూ.2000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయి.
2023 అక్టోబర్ ఏడో తేదీ వరకూ అన్ని బ్యాంకుల శాఖల వద్ద రూ.2000 నోట్ల డిపాజిట్లకు అనుమతించారు. 2023 అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల వద్ద రూ.2000 నోట్ల మార్పిడికి అనుమతి ఇచ్చింది కేంద్రీయ బ్యాంకు. అంతేకాదు వ్యక్తులు, సంస్థల ఖాతాల్లోనూ, పోస్టాఫీసు ద్వారా ఆర్బీఐకి రూ.2000 నోటును పంపేందుకు వెసులుబాటు కల్పించింది.
దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, బెంగళూరు, బెలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కోల్ కతా, లక్నో, ముంబై, నాగ్ పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. 2016 నవంబర్ ఎనిమిదో తేదీన అప్పటి రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. వాటి స్థానంలో రూ.500 నోట్లతోపాటు కొత్తగా రూ.2000 నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది.