Go First | ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గోఫస్ట్ ఎయిర్వేస్ (Go First) సంస్థ పలు విమాన సర్వీసులు రద్దు చేసింది. తొలుత ఈ నెల 3-5 తేదీల మధ్య విమాన సర్వీసులు రద్దు చేసిన గోఫస్ట్.. తాజాగా 9 వరకు సర్వీసులను రద్దు చేసింది. ఆపరేషనల్ సమస్యల వల్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది. ఆయా తేదీల్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి టికెట్ సొమ్ము తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. టికెట్లు బుక్ చేసుకున్న వారికి దాదాపు రూ.350 కోట్ల మేర సొమ్మును రిఫండ్ చేయాల్సి ఉందని గోఫస్ట్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా, రుణ వసూళ్లపై తాత్కాలిక మారటోరియం ప్రకటించడంతోపాటు దివాళా ప్రక్రియ చేపట్టాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గోఫస్ట్ కోరిన సంగతి తెలిసిందే. రుణ వసూళ్లపై తాత్కాలిక మారటోరియంపై ఎన్సీఎల్టీ తీర్పు రిజర్వు చేసినట్లు తెలుస్తున్నది. తన 26 విమానాలను జప్తు చేయకుండా నివారించాలని ఎన్సీఎల్టీని గోఫస్ట్ కోరింది. ఇదిలా ఉంటే ఈ నెల 15 వరకు టికెట్ల విక్రయాలను నిలిపేయాలని నిర్ణయించామని డీజీసీఏకు గోఫస్ట్ తెలిపింది. ఇప్పటికే బుక్ చేసిన టికెట్ల డబ్బు తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న విమాన జెట్ ఇంజిన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ (పీ & డబ్ల్యూ) సకాలంలో ఇంజిన్లు సరఫరా చేయలేకపోవడంతో నిధుల కొరత ఎదుర్కొంటున్నామని గోఫస్ట్ అధికారి ఒకరు తెలిపారు.
గో-ఫస్ట్ సంక్షోభం నేపథ్యంలో ఆ సంస్థ పైలట్లు .. టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. `ఇది చాలా బాధాకరం. పరిస్థితులు సజావుగా ఉంటే ఎయిర్లైన్స్ సేవలు ఉంటాయి. ఫ్లయింగ్ లైసెన్స్ కాపాడుకునేందుకు మేం మరో సంస్థలో చేరాల్సి వస్తుంది` అని రెండేండ్ల క్రితం గోఫస్ట్లో చేరిన ఓ పైలట్ తెలిపాడు.
`డిమాండ్, సప్లయ్ మధ్య వ్యత్యాసం తలెత్తినప్పుడు సంక్షోభాలు వస్తాయి. ధరలు పెరుగుతాయి కానీ, తేలిగ్గా పరిష్కారం అవుతాయి.గతంలో సంక్షోభంలో చిక్కుకున్నా.. అది తాత్కాలికం కావడంతో తిరిగి కోలుకుని సాధారణ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం గోఫస్ట్ సంక్షోభం తీవ్ర దురదృష్టకరం` అని స్పైస్ జెట్ సీఈవో అజయ్ సింగ్ స్పష్టం చేశారు.