చెన్నై, సెప్టెంబర్ 6: మురుగప్ప గ్రూప్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ అనుబంధ సంస్థ టీఐ క్లీన్ మొబిలిటీ.. దేశీయ మార్కెట్లోకి మోంత్రా ఎలక్ట్రిక్ 3డబ్ల్యూ ఆటోను పరిచయం చేసింది. చెన్నై షోరూం ప్రకారం ధర రూ.3.02 లక్షలుగా ఉన్నది. ఈ ఆటో దేశవ్యాప్తంగా ఉన్న 100కిపైగా డీలర్ల వద్ద లభించనున్నదని టీఐఐ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ మురుగప్ప తెలిపారు. దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆటోను తీర్చిదిద్దినట్లు, ముఖ్యంగా భద్రత, మైలేజీ అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు చెప్పారు. ఈ వాహనాలను ఉత్పత్తి చేయడానికి చెన్నైలో ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు, ప్రస్తుతం ఈ యూనిట్లో తొలి ఏడాది 75 వేల యూనిట్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2025 నాటికి దేశీయ ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహన మార్కెట్ 1.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా వేస్తున్నాయి.