కొత్తగూడెం ప్రగతి మైదాన్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట 28 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు మంగళవారం లొంగిపోయారు. వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పాటిలింగం మీడియాకు వెల్లడించారు. లొంగిపోయిన వారంతా ఆ పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన వారిగా పేర్కొన్నారు. వీరిలో 22 మందిపై రూ.89 లక్షల రివార్డు ఉందని, లొంగిపోయిన వారిలో 19 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. కాగా, నలుగురు హార్డ్ కోర్ మావోయిస్టులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఒకరు డివిజన్ కమిటీ సభ్యుడు పాండి ధ్రువ్ అలియాస్ దినేష్, ముగ్గురు తూర్పు బస్తర్ డివిజన్‌కి చెందిన 6వ నెంబర్ మిలటరీ కంపెనీ సభ్యులైన దూలే మాండవి, ఛత్తీస్ పోయం, పడ్ని ఓయం ఉన్నారని తెలిపారు.