న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. 92.5 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో దేశీయ శ్రీమంతుల జాబితాలో ఆయన తొలిస్థానంలోనే కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికిగాను విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ తర్వాతి స్థానంలో అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. 56.3 బిలియన్ డాలర్ల సంపద కలిగివున్నారు.
ఓపీ జిందాల్ గ్రూపు చైర్పర్సన్ సావిత్రి జిందాల్ మూడోస్థానాన్ని దక్కించుకున్నారు. 35.5 బిలియన్ డాలర్ల సంపదతో భారత్లో అత్యంత సంపన్న మహిళగా నిలిచారని పేర్కొంది. ప్రస్తుతేడాదికిగాను దేశీయ కుబేరుల జాబితాలోకి కొత్తగా ఐదుగురు చేరినట్టు వెల్లడించింది. దీంతో మొత్తం సంఖ్య 205కి చేరుకున్నారు.
వీరి మొత్తం సంపద 941 బిలియన్ డాలర్లు. అంతక్రితం ఏడాది నమోదైన 954 బిలియన్ డాలర్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడం, స్టాక్ మార్కెట్లు పతనం చెందడం వల్లనే వీరి సంపద కరిగిపోవడానికి కారణమని తెలిపింది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 3,028కి చేరుకున్నారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 247 మంది అధికమయ్యారు. వీరి సంపద 16.1 ట్రిలియన్ డాలర్లు. 2024లో ఉన్న సంపాదనతో పోలిస్తే 2 ట్రిలియన్ డాలర్లు అధికమైంది. దేశాలవారీగా చూస్తే అమెరికాలో అత్యధికంగా 902 మంది బిలియనీర్లు ఉండగా, చైనాలో 516 మంది, భారత్లో 205 మంది ఉన్నారు.