ముంబై: దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరని అడిగితే అందరూ ముక్త కంఠంతో చెప్పే పేరు ‘ముకేశ్ అంబానీ (Mukesh Ambani)’. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆయన లక్షల కోట్లు ఆర్జిస్తున్నారు. మరె దేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న వ్యక్తి ఎవరనే ప్రశ్న వస్తే ఎవరి పేరు వినిపిస్తుంది..? ఎవరా..! అని ఆలోచిస్తున్నారా..? ఇంకెవరు..? ముకేశ్ అంబానీనే. అవును.. అప్పుల్లో కూడా ఆయనే అగ్రగామిగా ఉన్నట్లు తాజా నివేదిక చెబుతోంది. ఆ నివేదికలోని మరిన్ని ఆసక్తికరమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఏస్ ఈక్విటీ డేటా ప్రకారం.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ.3.13 లక్షల కోట్ల అప్పు చేసింది. ప్రస్తుతం ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో రిలయన్స్ ప్రథమ స్థానంలో ఉంది. దేశంలోని పెద్ద విద్యుత్ రంగ కంపెనీలలో ఒకటైన ‘నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)’ రూ.2.20 లక్షల కోట్ల అప్పుతో జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.
ఇక వోడాఫోన్ ఐడియా అప్పుల గురించి కూడా గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని అప్పు రిలయన్స్ కంటే తక్కువని తెలుస్తోంది. ఈ కంపెనీ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పటికీ అప్పు మాత్రం రూ.2.01 లక్షల కోట్లుగా ఉన్నది. భారతీ ఎయిర్టెల్ కూడా దేశంలో ఎక్కువ అప్పు తీసుకున్న కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ మొత్తం అప్పు రూ.1.65 లక్షల కోట్లు.
అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థ ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL)’ రూ.1.40 లక్షల కోట్ల అప్పులతో, ‘ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)’ రూ.1.29 లక్షల కోట్ల అప్పుతో జాబితాలో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (PGCIL) అప్పు రూ.1.26 లక్షల కోట్లు కాగా.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ అప్పు రూ.1.25 లక్షల కోట్లుగా స్పష్టమవుతున్నది.
చంద్రయాన్ మిషన్లో కీలకపాత్ర పోషించిన ‘లార్సెన్ అండ్ టుబ్రో (Larsen & Toubro)’ సంస్థకు రూ.1.18 లక్షల కోట్ల అప్పు ఉంది. లక్ష కోట్ల కంటే ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా ఉంది. ఈ కంపెనీ ప్రస్తుత అప్పు రూ.1.01 లక్షల కోట్లు. అయితే ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్ లేకపోవడం గమనార్హం.