ముంబై, మార్చి 27: దేశీయ శ్రీమంతుడు ముకేశ్ అంబానీ సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. గడిచిన ఏడాదికాలంలో ఆయన సంపద 13 శాతం తరిగిపోయి రూ.8.6 లక్షల కోట్లకు పరిమితమైనట్లు ప్రస్తుత సంవత్సరానికిగాను హురున్ ఇండియా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ దేశీయ శ్రీమంతుల జాబితాలో తొలిస్థానంలో నిలిచినట్లు పేర్కొంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన కుబేరుల జాబితా నుంచి వైదొలిగినప్పటికీ ఆసియా కుబేరుడిగా కొనసాగుతుండటం విశేషం.
కానీ, ఇదే సమయంలో అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ లక్ష కోట్ల రూపాయల సంపదను పోగేసుకొని ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 15తో ముగిసిన ఏడాదికాలంలో గౌతమ్ అదానీ రూ.8.4 లక్షల కోట్ల సంపదను కలిగివున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో 284 మంది బిలియనీర్లు ఉండగా, వీరి సంపద ఏడాది ప్రాతిపదికన 10 శాతం ఎగబాకి రూ.98 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. లేదా దేశ జీడీపీలో మూడోవంతు వీరివద్ద ఉన్నది.
భారత్ మరో రికార్డు సృష్టించింది. కుబేరుల సరాసరి సంపదలో తన పొరుగు దేశమైన చైనాను అధిగమించి రికార్డు నెలకొల్పింది. భారత్‌లో ఒక్కొక్కరి సంపద రూ.34,514 కోట్లు కాగా, అదే చైనాలో ఇది రూ.29,027 కోట్లుగా ఉన్నది. మరోవైపు, 175 మంది బిలియనీర్ల సంపద పెరగగా, 109 మంది సంపద హరించుకుపోయింది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 420 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. గడిచిన ఏడాదికాలంలో ఈ సంస్థ అంచనాలకుమించి రాణించడం వల్లనే సంపద భారీగా పెరగడానికి ప్రధాన కారణం. అలాగే ఈ జాబితాలో 266 బిలియన్ డాలర్లతో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ రెండో స్థానంలో నిలువగా.. మెటా కో-ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(242 బిలియన్ డాలర్లు), ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ ఎల్లిసన్(203 బిలియన్ డాలర్లు), బర్క్‌షైర్ హ్యాథ్వేస్ సీవో వారెన్ బఫెట్(167 బిలియన్ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.