Mukesh Ambani | భారత కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గత కొంతకాలంగా విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల న్యూయార్క్, దుబాయ్ నగరాల్లో అత్యంత ఖరీదైన విల్లాలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దుబాయ్ నగరంలో మరో అత్యంత విలాసవంతమైన విల్లాను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దుబాయ్‌లోని పామ్ జుమైరా ప్రాంతంలో బీచ్ పక్కన ఉన్న లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారట. ఈ నగరంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ అని తెలుస్తోంది.
కళ్లు చెదిరే ఈ భవంతి ధర దాదాపు రూ.1,349 కోట్లు (163 మిలియన్ డాలర్లు) అని సమాచారం. ఇది దుబాయ్‌లోని పామ్ జెమైరా దీవిలో ఉంది. కువైట్ వ్యాపారవేత్త మహమ్మద్ అల్షయా నుంచి అంబానీ ఈ భవంతిని గత వారమే కొనుగోలు చేసినట్లు సమాచారం. పామ్ జుమైరా అనేది దుబాయ్‌లో పామ్ చెట్టు ఆకారంలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన దీవుల సముదాయం. ఇందులో ఉన్నవన్నీ విలాసవంత విల్లాలే.
ముకేశ్ అంబానీ.. తన చిన్ని కుమారుడు అనంత్ అంబానీ కోసం గతంలో దుబాయ్‌లో ఓ విల్లాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రూ.643 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన విల్లాను సొంతం చేసుకున్నారు. దుబాయ్ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ప్రాపర్టీగా అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా రూ.వెయ్యి కోట్లతో మరో విల్లాను సొంతం చేసుకోవడం గమనార్హం.