హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): విద్యుత్ కష్టాల నుంచి బయట పడటంతోపాటు బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు సోలార్ విద్యుత్ వైపు అడుగులు వేస్తున్నాయి. పర్యావరణ హితంగా కూడా ఉండటంతోపాటు కేంద్ర ప్రభుత్వం భారీగా రాయితీలు ఇస్తుండటంతో చాలా సంస్థలు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. సోలార్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుండటం కూడా కలిసిరానున్నది.
దేశీయంగా వినియోగిస్తున్న మొత్తం విద్యుత్‌లో 50 శాతానికి పైగా వాటాను ఎంఎస్ఎంఈలు సహా పరిశ్రమలు కలిగివున్నాయి. ప్రస్తుతం దేశంలో 6.3 కోట్లకుపైగా ఎంఎస్ఎంఈలు ఉండగా, తెలంగాణలో 60 వేలకు పైగా సంస్థలు ఉన్నట్లు అంచనా. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి 40గిగా వాట్ల సోలార్ విద్యుత్‌ను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా భారీగా సబ్సిడీలు అందిస్తుండటంతో గృహ వినియోగదారులతోపాటు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల వారు కూడా సోలార్ విద్యుత్ ఏర్పాటునకు మొగ్గుచూపుతున్నారు.