Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు) పాలసీని తేవడంలో చూపిన శ్రద్ధ.. దాన్ని అమలు చేయడంలో మాత్రం చూపడం లేదు. ఎంఎస్ఎంఈ-2024 విధానాన్ని ప్రవేశపెట్టి 6 నెలలు దాటినా దాని మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. దాదాపు ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ వస్తున్నదని రేవంత్ సర్కారు ప్రచారం చేయడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దీని కోసం నెలల తరబడి ఎదురుచూశారు.
అయితే పాలసీని తెచ్చి ఆరు నెలలు దాటినా ఇంతవరకు మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. మార్గదర్శకాలు వచ్చేదాకా దరఖాస్తుల ప్రాసెసింగ్ కాకపోవడం వల్ల దరఖాస్తుదారులు వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఎంఎస్ఎంఈ-2024ను విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టంలోని అంశాలనే స్వల్ప మార్పులతో కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించినా.. దాని అమలులో జాప్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో వివిధ వర్గాలకు కల్పిస్తున్న సబ్సిడీలను పెంచడంతోపాటు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను బ్యాంకు రుణాలకు గ్యారంటీ కింద చూపే వెసులుబాటు కల్పిస్తామని, ఈ మేరకు బ్యాంకర్లను ఒప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
రాయితీల పెంపు విషయం పక్కనపెడితే, అసలు ఇంతవరకు ఆ రాయితీలకు సంబంధించిన బకాయిలనే ప్రభుత్వం విడుదల చేయకపోవడం గమనార్హం. అంతేకాదు సరసమైన ధరలకు భూములను సమకూర్చడమేగాక, ప్రభుత్వం అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో 20 శాతం ప్లాట్లు ఎంఎస్ఎంఈలకు రిజర్వు చేస్తామని కూడా ప్రభుత్వం పేర్కొన్నది. అయితే ప్రభుత్వం విడుదల చేస్తున్న వరుస భూసేకరణ నోటిఫికేషన్లకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీంతో ఇండస్ట్రీ పార్కుల వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వస్తుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేసి అందులో 20 శాతం ఎంఎస్ఎంఈలకు కేటాయిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున చిన్నతరహా ఫ్లాట్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయనున్నట్టు, వీటిలో స్వయం సహాయక సంఘాలు చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సాహిస్తామని చెప్పారు. అయితే వీటి కోసం భూసేకరణకుగానీ, నిర్మాణాలకుగానీ ప్రభుత్వం వద్ద నిధులు లేవని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కోసం సేకరించిన భూములనే కొత్త పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కోసం పది జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను అభివృద్ధి చేసింది. రానున్న రోజుల్లో వీటినే కొత్త పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దే వీలుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీంతో నిధుల కొరత కారణంగా మిగిలిన హామీల మాదిరిగానే ఎంఎస్ఎంఈ పాలసీ కూడా తయారవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేస్తే కొంత స్పష్టత వచ్చే వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
కొత్త పాలసీలో టీ-ఐడియా పథకం కింద తయారీ సంస్థలకు ఇస్తున్న క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచి.. గరిష్ఠ రాయితీ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు సవరిస్తున్నారు. అలాగే టీ-ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న రాయితీలు 35 శాతం నుంచి 50 శాతానికి పెంచుతూ.. గరిష్ఠ రాయితీ పరిమితిని రూ.75 లక్షల నుంచి కోటి రూపాయలకు పెంచనున్నట్టు చెప్తున్నారు.
ఇక మహిళా యాజమాన్యంలో నడిచే ఎంఎస్ఎంఈలకు ఇస్తున్న 10 శాతం అదనపు రాయితీని 20 శాతంగా నిర్ణయిస్తూ.. గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు వృద్ధి చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ అసలు మార్గదర్శకాలే లేకపోవడంతో ఈ కొత్త పాలసీ అమలుకు నోచుకోలేక పోతున్నది. అంతేకాదు సబ్సిడీల బాపతు ఇవ్వాల్సిన రూ.3,000 కోట్ల బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.