హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తేతెలంగాణ): రానున్న పదేండ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల (రూ. 84 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఏఐ, సెమీ కండక్టర్ల ఉత్పత్తి, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాలు ఈ అసాధారణ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులుగా మారనున్నాయని విశ్లేషించారు.
ఏఐలో దిగ్గజ కంపెనీ ఫెనామ్ శుక్రవారం హైటెక్‌సిటీలో నిర్వహించిన ‘ఐయామ్ ఫెనామ్ ఇండియా’ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా భవిష్యత్‌లో నిపుణులైన మానవ వనరులను అందిస్తామని మంత్రి వెల్లడించారు.