హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాన్ని ఉత్పాదక రంగంలో అగ్రగామిలా నిలిపేలా ‘మేకిన్ తెలంగాణ’ భావనను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పారిశ్రామిక రంగానికి పిలుపునిచ్చారు. దేశీయ మారెట్లో తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ ఉండేలా నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. క్వాలిటీ సరిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్ఐ) హైదరాబాద్ చాప్టర్ 38వ వార్షిక సదస్సును బేగంపేటలోని ఓ హోటల్లో ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు.
పరిమాణంపైనే కాకుండా నాణ్యతకు ప్రాధాన్యతనిస్తే దేశమంతా మనవైపు చూస్తుందన్నారు. ఇక ఉద్యోగుల సృజనాత్మకతను వెలికితీసి ఆయా రంగాల్లో ఉత్పాదకతను పెంచేందుకు క్వాలిటీ ఫోరం చేస్తున్న కృషిని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. ‘క్యాంపస్ టు కార్పొరేట్’ అనే మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడం ప్రశంసనీయమని కొనియాడారు.
క్వాలిటీ సరిల్ శిక్షణ కార్యక్రమాలకు సహకరించిన ఈసీఐఎల్, ఎన్ఎండీసీ, ఆర్టీసీ, థర్మోపాడ్స్, థర్మోకేబుల్స్, ఉషా ఇంటర్నేషనల్, టాటా గ్రూప్, రేణుకా ప్లాస్టిక్, తోషిబా, రామ్కో, కెసీపీ సిమెంట్స్, హెఏఎల్, మిథాని, బీఈఎల్ సంస్థలకు ఈ సందర్భంగా మంత్రి ప్రోత్సాహకాలు అందజేశారు.
కృత్రిమ మేథను ప్రోత్సహిస్తాం
కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ)ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రోజువారీ కార్యక్రమాల్లోనూ ఏఐ భాగమైపోయిందని, దీనిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన విధానాలతో ముందుకుపోతోందని చెప్పారు.
ఇందులో భాగంగానే విద్యార్థుల భవిష్యత్ అవసరాలు తీర్చేలా స్కిల్డ్ వర్శిటీల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఏఐ వినియోగంపై ఉద్యోగులు, కార్మికులు, పరిశ్రమ ప్రతినిధులకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫోరం జాతీయ చైర్మన్ శ్యామ్ మోహన్, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ బాలకృష్ణరావులు కూడా మాట్లాడారు.