హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సర్కారు రాబట్టిన పెట్టుబడులు ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నట్టుగానే, అప్పట్లో అభివృద్ధి చేసి పంపిణీ కాకుండా ఉన్న పారిశ్రామిక వాడలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో భూసేకరణ జరిపిన నాలుగు కొత్త పారిశ్రామిక వాడల అభివృద్ధి పనులను టీజీఐఐసీ చేపట్టింది. ఇందులో ఒకటైన మొబిలిటీ వ్యాలీ పార్కు మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భూమిపూజ చేశారు.
తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అప్పట్లో కేసీఆర్ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా 28,458 ఎకరాల విస్తీర్ణంలో 156 పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసింది. ఇందులో ఇంకా 5,730 ఎకరాలు పంపిణీ చేయాల్సి ఉంది. సైబరాబాద్, మేడ్చల్-సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, పటాన్‌చెరూ, శంషాబాద్, యాదాద్రి, ఖమ్మం, వరంగల్ తదితర జోన్లను ఏర్పాటుచేసి అక్కడి ప్రభుత్వ భూములను పరిశ్రమల కోసం రిజర్వు చేసింది. అంతేకాదు 1,45,682.99 ఎకరాల ఉపయోగం లేని ప్రభుత్వ భూములను పరిశ్రమల కోసం గుర్తించింది. దీన్ని పరిశ్రమల ల్యాండ్ బ్యాంక్‌గా ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా నాలుగు పారిశ్రామిక వాడలను అందుబాటులోకి తెస్తున్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం ఎనకతల గ్రామంలో 862 ఎకరాల్లో రూ.44.3 కోట్లతో టీజీఐఐసీ మొబిలిటీ వ్యాలీ పార్ను అభివృద్ధి చేస్తున్నది. అలాగే మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం మాదారం గ్రామ పరిధిలో సుమారు 300 ఎకరాల్లో పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఫేజ్-1 అభివృద్ధిలో భాగంగా రూ.14.06 కోట్లతో ఇంటర్నల్ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రామం పరిధిలోని సుమారు 60 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్-2 అభివృద్ధి పనులు చేపట్టారు. ఇంటర్నల్ రోడ్లు, కల్వర్టులు, లైటింగ్ తదితర పనుల కోసం రూ.34.11 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఇక వరంగల్ జిల్లా గీసుకొండలో సుమారు 1,350 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను బీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదించి భూసేకరణ నిర్వహించింది. ఇందులో మొదటి దశ ఇప్పటికే పూర్తవగా, రెండో దశలో భాగంగా సుమారు 350 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ క్లస్టర్ కోసం రూ.5.81 కోట్లతో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ నాలుగు ఇండస్ట్రియల్ పార్క్‌లకు గతంలోనే భూసేకరణ పూర్తిచేయగా, ఇటీవల ప్లాట్ల కేటాయింపును చేపట్టారు. ఓ వైపు ప్లాట్లు విక్రయిస్తూనే మరోవైపు ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టారు.
తెలంగాణను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వీటిలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా తెలంగాణ యువతను ప్రోత్సహిస్తామన్నారు. మొబిలిటీ వ్యాలీ పార్కు భూమి పూజ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీనివల్ల రెండేండ్లలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, దాదాపు 25 వేల మంది యువతకు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
పరిశ్రమల ఏర్పాటును కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, వాటిని మరింత బలోపేతం చేసేందుకే ప్రత్యేక పాలసీ తెచ్చామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నట్టు మంత్రి వివరించారు. కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.