హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): అమెరికా టెలికాం దిగ్గజం టీ-మొబైల్ యూఎస్ఏ.. టీఎంయూఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ టెక్నాలజీ ద్వారా హైదరాబాద్లో గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ (జీటీసీ)ను తెరిచింది. సంస్థకు అమెరికా వెలుపల ఉన్న ఏకైక గ్లోబల్ టెక్ సెంటర్ ఇదే కావడం విశేషం. గురువారం హైటెక్ సిటీలో దీన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. అనుకూలమైన ఎకోసిస్టమ్ ఉండటంతో టెక్నాలజీ, ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణలకు అడ్డాగా తెలంగాణ మారిందన్నారు.
2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ భారీ టెక్నాలజీ సెంటర్.. వచ్చే ఏడాదికల్లా 1,000 మంది నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని చెప్పారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున అనేక సంస్థలు తమ నూతన కేంద్రాల ఏర్పాటు, తదుపరి విస్తరణల కోసం హైదరాబాద్కు వస్తున్నాయని వివరించారు. ఇప్పటికే సెమీ కండక్టర్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, లైఫ్ సైన్సెస్ తదితర రంగాలకు సంబంధించిన జీసీసీలు ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో సంస్థ గ్లోబల్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ చంద్ర గుప్త, తదితరులున్నారు.