హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర రీతిలో రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేశామన్నారు. తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా లైఫ్‌సైన్సెస్ పాలసీ 2.0, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (టీఏఐహెచ్)ను దావోస్ వేదికగా లాంఛనంగా ఆవిషరిస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తెలంగాణతో రాయల్ ఫిలిప్స్ జట్టు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యమయ్యేందుకు ప్రముఖ హెల్త్‌టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకొచ్చింది. దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం రాయల్ ఫిలిప్స్ అంతర్జాతీయ నాయకత్వంతో భేటీ అయింది.