హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): సబ్సిడీల కోసం సెమీకండక్టర్ పరిశ్రమలు సహజంగానే గుజరాత్‌కు తరలిపోతున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గుజరాత్ మనకన్నా ఎక్కువ సబ్సిడీలు ఇస్తున్నదని, దీనికితోడు అక్కడ పరిశ్రమ పెడితేనే కేంద్రం నుంచి రాయితీలు వస్తాయనే ప్రచారం ఉందని ఆయన పేర్కొన్నారు. కేన్స్ సెమీకండక్టర్ పరిశ్రమకు తాము రూ. 330 కోట్ల సబ్సిడీని ఆఫర్ చేశామని, గుజరాత్ మాత్రం రూ. 661కోట్ల సబ్సిడీ ఇస్తున్నదని, అందుకే కేన్స్ గుజరాత్‌లోని సనంద్‌కు తరలిపోయిందని మంత్రి ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. కేన్స్ సెమీకండక్టర్ పరిశ్రమ రాష్ర్టాన్ని వీడిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీమంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేన్స్ సెమీకండక్టర్ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందనడం కంటే కేంద్రంతోపాటు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం భారీ సబ్సిడీలు కుమ్మరించి లాకుపోయాయని చెప్పడం సబబుగా ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 76,000 కోట్లతో ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్'(ఐఎస్ఎం)ను ఏర్పాటు చేసిందని, ఈ మిషన్ కింద గుజరాత్‌లోని సనంద్‌లో కేన్స్ సెమీకాన్ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు 50 శాతం సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందించినట్టు చెప్పారు. కేన్స్ ప్రతిపాదిత ప్రాజెక్టు వ్యయం రూ. 3,307 కోట్లు కాగా, ఇందులో సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం రూ. 1,653.45 కోట్లు ఇస్తున్నదని, అంతేకాకుండా ఇందులో మరో 40శాతం, అంటే మరో రూ. 661కోట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద సబ్సిడీ అందిస్తున్నదని తెలిపారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ, ప్రాజెక్టు వ్యయంలో దాదాపు 70 శాతంగా, అంటే రూ. 2,314.9 కోట్లుగా ఉందన్నారు.
ఒకవేళ కేన్స్ తెలంగాణాలో సెమీకండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం రూ.330 కోట్లు మాత్రమే రాయితీ ఇచ్చే వీలుందని, అంతేకాకుండా, మన రాష్ట్రంలో పరిశ్రమ పెడితే కేంద్ర ప్రభుత్వం ఇంత ఉదారత చూపించదని చెప్పారు. గుజరాత్లో పరిశ్రమ పెడితే కేంద్ర సబ్సిడీ విషయం ఆ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందనే ప్రచారం కూడా ఉందని, దీంతో సెమీకండక్టర్ పరిశ్రమలు సహజంగానే ఈ ప్రచారాన్ని విశ్వసిస్తున్నాయని వివరించారు. గుజరాత్లో నెలకొల్పే సెమీకండక్టర్ పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు చూస్తే ఒక ఉద్యోగానికి రూ.3.2 కోట్ల సబ్సిడీలు లభిస్తున్నాయని సాక్షాత్తు కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి పేరొన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. పరిశ్రమలు రాష్ర్టాన్ని వీడడం తమ వైఫల్యం కాదని, సబ్సిడీల విషయంలో గుజరాత్ రాష్ర్టానికి ఉన్న అనుకూలతలు మనకు లేనందున సెమీకండక్టర్ పరిశ్రమలు అక్కడి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నాయని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.