పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. ఓవైపు యుద్ధానికి స్వల్ప విరామం ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా.. ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. పొరుగు దేశాలపై దాడుల్ని తీవ్రతరం చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్ అగ్ని గుండంగా మారింది. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 263.67 పాయిం ట్లు లేదా 0.35 శాతం క్షీణించి 73,319.55 దగ్గర స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 106.50 పాయింట్లు లేదా 0.47 శాతం పతనమై 22,713.10 వద్ద ముగిసింది. అయితే రెండు రోజులు సెలవులు కావడం, సోమవారం భారీ నష్టాలను బుధ, గురువారాల్లోని లాభాలు కాస్త భర్తీ చేయడం కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ఒడిదుడుకులకు వీలుందనే మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి సాధారణ స్థితికి రాకుండా పోతున్నది మరి. ఇదిలావుంటే ఈ వారం ట్రేడింగ్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య విధాన పరపతి సమీక్ష కూడా ప్రభావితం చేయనున్నది.
ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అంచనాల నడుమ కీలక వడ్డీరేట్లపై సెంట్రల్ బ్యాంక్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న టెన్షన్ నెలకొన్నది. వడ్డీరేట్ల పెంపు సెల్లింగ్ ప్రెషర్‌కు దారితీస్తుందని చెప్పవచ్చు. పెంచకపోతే కొంతలోకొంత ఊరటగా భావించవచ్చు. వార్ అప్డేట్స్ కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయి. మొత్తానికి మదుపరులు ఆచితూచి అడుగులు వేసే వీలున్నది. ఇక చమురు-గ్యాస్, మెటల్, ఆటో, రిటైల్ రంగ షేర్లు పెట్టుబడుల ఉపసంహరణకు గురికావచ్చన్న అంచనాలున్నాయి. బ్యాంకింగ్, రియల్టీ షేర్లూ ఆటుపోట్లకు లోనుకావచ్చు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలూ కీలకమే. మరోవైపు గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులూ ప్రధానమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కొనసాగితే నిఫ్టీకి 22,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 22,900-23,200 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.