Satya Nadella | కార్పొరేట్ సంస్థల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (సీఈఓ)లు అత్యంత కీలకం. వ్యూహ రచనలోనూ, ఆదాయం పెంపులోనూ, సిబ్బంది పనితీరు మెరుగు పర్చడంతోపాటు సాధక బాధకాలు తీర్చడంలోనూ సీఈఓలే కీలకం. ఇక ఐటీ, టెక్ సంస్థల సీఈఓలైతే వేరే చెప్పనక్కర్లేదు. సంస్థ పురోగతి సాధించడంలో ఎంతో ముఖ్య భూమిక పోషించే సీఈఓల వేతన భత్యాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కంపెనీ షేర్లు లాభపడే కొద్దీ వారి జీత భత్యాలు కూడా అదేస్థాయిలో పెరుగుతుంటాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ (Microsoft CEO) సత్య నాదెళ్ల (Satya Nadella) వేతనం భారీగా పెరిగింది.
2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన వేతనం 79.1 మిలియన్ డాలర్లకు చేరింది. ఇది మన భారత కరెన్సీలో రూ.664 కోట్లతో సమానం. ఈ విషయాన్ని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్ (regulatory filing)లో పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన 48.5 మిలియన్ డాలర్లు అందుకోగా.. దాంతో పోలిస్తే ఇది 63 శాతం అధికం (Nadella Got 63 Per Hike). జూన్‌లో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో దూసుకెళ్లింది. దాంతో కంపెనీ షేర్లు సుమారు 31.2 శాతం లాభపడ్డాయి. ఈ కారణంగా మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. ఫలితంగా, నాదెళ్ల స్టాక్ అవార్డులు 39 మిలియన్ డాలర్ల నుంచి 71 మిలియన్ డాలర్లకు పెరిగాయి.
ఇక సంస్థకు ఆయన అందించిన సేవలకు గానూ సత్య నాదెళ్లకు 5.2 మిలియన్ డాలర్లు నగదు ప్రోత్సాహకం అందనున్నట్లు కంపెనీ ఫైలింగ్‌లో తెలిపింది. అయితే ఆయనకు రావాల్సిన 10.7 మిలియన్ డాలర్ల కంటే ఇది తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా ప్రోత్సాహకం తగ్గినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సీఈఓగా గత పదేళ్ల కాలంలో సత్య నాదెళ్ల వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. అనేక విషయాల్లో కీలక పాత్ర పోషించారు.
1975లో ప్రారంభించిన మైక్రోసాఫ్ట్‌లో నాదెళ్ల సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు జరిగాయి. క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ అప్లికేషన్స్, కృత్రిమ మేధస్సు వంటి అంశాలపైనే ప్రధానంగా మైక్రోసాఫ్ట్ కేంద్రీకరించింది. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ శరవేగంగా పెరిగింది. అసాధారణ రీతిలో కోవిడ్-19 ప్రభావం చూపినా నాదెళ్ల హయాంలో మైక్రోసాఫ్ట్ మంచి ఫలితాలు సాధించింది.
Also Read..
Elephant | ఏనుగుతో సెల్ఫీ కోసం యత్నం.. తొక్కి చంపిన గజరాజు
Modi Laddu | ప్రధానిపై అభిమానం.. దీపావళికి ‘మోదీ లడ్డూ’.. ప్రత్యేకంగా తయారు చేస్తున్న వ్యాపారి