న్యూఢిల్లీ, డిసెంబర్ 9: మైక్రోసాఫ్ట్.. భారత మార్కెట్లో సుస్థిరమైన స్థానం సాధించడానికి భారీ పెట్టుబడులను ప్రకటించింది. వచ్చే నాలుగేండ్లలో 17.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. భారత్‌లో కృత్రిమ మేధ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను అందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్టు ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆయన ప్రకటించారు.
దేశీయ ఏఐ ఆశయాలకు మద్దతుగా పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించారు. ఇది ఆసియాలో అతిపెద్ద పెట్టుబడిగా ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఇది అదనం.
భారత్‌లో కంప్యూటర్ చిప్‌ల తయారీ యూనిట్‌కు కట్టుబడివున్నామని ఇంటెల్ సీఈవో లిప్-బు టాన్ తెలిపారు. భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇండియన్ సెమికండక్టర్ మిషన్‌కు తమ మద్దతుగా నిలిచేక్రమంలో ఇక్కడ ఎలక్ట్రానిక్ కంపొనెంట్ ఎకోసిస్టాన్ని నెలకొల్పనున్నట్టు ఆయన ప్రకటించారు.
ఇప్పటికే సంస్థ..టాటా గ్రూపుతో కలిసి ఇక్కడ సెమికండక్టర్ అసెంబ్లి యూనిట్‌ను నెలకొల్పబోతున్నది. అమెరికా టెక్నాలజీ దిగ్గజంతోపాటు లఖీద్ మార్టిన్, ఐప్లెడ్ మెటీరియల్స్ సంస్థలు కూడా ఇక్కడ చిప్‌ల యూనిట్ నెలకొల్పబోతున్నాయి.