పూణె, జనవరి 14 : మెర్సిడెజ్ బెంజ్.. దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. నూతన సంవత్సరంలో సరాసరిగా మరో 12 మాడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. మరోవైపు, ప్రాంతీయంగా తయారైన అల్ట్రా లగ్జరీ ఎస్యూవీ జీఎల్ఎస్ మేబ్యాక్‌ను భారత్‌లో తయారు చేసి బుధవారం విడుదల చేసింది. దీంతో ఈ కారు ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.3.17 కోట్ల స్థాయిలో ఉండగా, భవిష్యత్తులో దీని ధర రూ.2.75 కోట్లకు దిగి రానున్నది.
కరెన్సీ హెచ్చుతగ్గుదల కారణంగా వాహన ధరలు పెరగడంతో ఈసారి లగ్జరీ కార్ల విక్రయాల్లో వృద్ధి సింగిల్ డిజిట్‌కు పరిమితంకానున్నదన్నారు. మరోవైపు, ఈక్యూస్ ఎస్యూవీ సెలెబ్రేషన్ ఎడిషన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.1.34 కోట్లు, గరిష్ఠ ధర రూ.1.48 కోట్లు(7 సీట్లు)గా ధరను నిర్ణయించింది. యూరోతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనం చెందడం, ఉత్పత్తి వ్యయం అధికం కావడంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ధరలను పెంచబోతున్నట్టు ఆయన ప్రకటించారు.