హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఉపాధి రంగానికి ఆయువు పైట్టెన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక అనుకూల విధానాలతో ఎంఎస్ఎంఈ రంగం ఎంతగానో వృద్ధి చెందింది. ఇంజినీరింగ్, కెమికల్స్, మెటల్, ఆహార ఉత్పత్తులు రాష్ట్ర అవసరాలను తీర్చడంతోపాటు ఇతర రాష్ర్టాలకు కూడా ఎగుమతి అయ్యేవి. అయితే గత కొంతకాలంగా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి తీవ్ర పోటీ ఏర్పడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల తక్కువ ధరకే వారు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలను పూర్తిగా విస్మరించడం వల్ల ఆయా రాష్ర్టాల పోటీని తట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందని వారు పేర్కొంటున్నారు. ఈ రంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎంఎస్ఎంఈ-2024 పాలసీ కాగితాలకే పరిమితం కావడంతోపాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందకపోవడంతో చిన్న..చితక సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
గిరాకీ అంతంతే..
ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు గిరాకీ లేకుండా పోతున్నది. ఇతర రాష్ర్టాల నుంచి పోటీ తీవ్రతరం కావడంతో కొనేవాళ్లు కరువయ్యాయని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా ఆహార పదార్ధాలు, కెమికల్స్, మెటల్ ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ యంత్రాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, రబ్బర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, అల్లిక-దుస్తుల ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ఆహార పదార్థాల నుంచి పోటీ ఎదురవుతుండగా.. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ప్లాస్టిక్, కెమికల్స్, తమిళనాడు నుంచి యంత్రాలకు పోటీ ఎదురవుతున్నదని చెబుతున్నారు. ఉత్పత్తి వ్యయంకన్నా తక్కువ ధరకు ఆయా రాష్ర్టాలు మార్కెటింగ్ చేస్తున్నాయని, దీనివల్ల ఉత్పత్తులు అమ్ముకోలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వారు వాపోతున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ కూడా రంగంలోకి దిగిందని, ఆయా రాష్ట్ర ఉత్పత్తులను తెలంగాణలో ప్రమోట్ చేయడానికి ఆ రాష్ట్రం పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటిస్తున్నది. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ర్టాలు ఫార్మా, ఆహార ఉత్పత్తుల పరిశ్రమలను ఆకర్షించేందుకు తరచూ రాష్ట్రంలోని పరిశ్రమ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మరోపక్క ఇతర రాష్ర్టాలు పిలుస్తుండడంతో ఎంఎస్ఎంఈలు పక్క రాష్ర్టాలకు వెళ్లే అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి..