TCS – Infosys | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.83 లక్షల కోట్లు వృద్ధి చెందింది. దేశీయ ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 963.87 పాయింట్లు (1.21 శాతం) లబ్ధి పొందింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,894.44 కోట్లు పెరిగి రూ.14,51,739.53 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.33,320.03 కోట్ల వృద్ధితో రూ.6,83,922.13 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,611.36 కోట్లు పుంజుకుని రూ.21,51,562.56 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.23,676.78 కోట్ల లబ్ధితో రూ.8,67,878.66 కోట్ల వద్ద నిలిచింది.
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,950.99 కోట్ల వృద్ధితో రూ.6,42,524.89 కోట్లకు పెరిగింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.16,917.06 కోట్లు పెరిగి రూ.5,98,487.89 కోట్ల వద్ద నిలిచింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.10,924.13 కోట్ల లాభంతో రూ.5,41,399.95 కోట్లకు చేరుకున్నది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.9,995.57 కోట్లు పెరిగి రూ.7,67,561.25 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26,970.79 కోట్ల పతనంతో రూ.12,53,894.64 కోట్లతో సరి పెట్టుకున్నది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.8,735.49 కోట్ల నష్టంతో రూ.8,13,794.86 కోట్లకే పరిమితమైంది. గతవారం ట్రేడింగ్ ముగిశాక రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ నిలిచాయి.